గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (14:42 IST)

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి షాపింగ్ మాల్‌కు కరెంట్ సరఫరా నిలిపివేత

singireddy niranjan reddy
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత నిరంజన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌కు ఆ రాష్ట్ర విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఈ షాపింగ్ మాల్ స్థలం అద్దె, విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులోభాగంగా, షాపింగ్ మాల్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. 
 
స్థానిక బస్టాండుకు ఆనుకొని ఆర్టీసీకి చెందిన ఏడువేల చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్) పేరిట భవన నిర్మాణం చేపట్టి దుకాణాలు, సినిమా హాళ్లు ఏర్పాటుచేశారు.
 
అయితే ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసు ఇస్తూ వచ్చారు. అయినా ఎంతకూ చెల్లించకపోవడంతో గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్ వద్దకు వెళ్లి.. మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు ప్రకటించారు. 
 
తక్షణం చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో గురువారం సరఫరాను నిలిపివేశారు. ఈ విషయాన్ని సంబంధితశాఖ ఏడీఈ శ్రీధర్ ధృవీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్శాఖ అధికారులు చెప్పారు. అయినప్పటికీ మల్టీప్లెక్స్ యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.