రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, 24వ తేదీన వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి... ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపింది.
ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. 24 నాటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడుతాయని తెలిపింది. 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్, వనపర్తి, తదితర జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని పేర్కొంది.