1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:19 IST)

తెలంగాణ : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అనిల్ కుమార్.. ఎవరీయన?

anil kumar - renuka chowdhury
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు సీనియర్ మహిళా కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. వీరిలో రేణుకా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, అనిల్ కుమార్ యాదవ్ ఎవరన్నది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ మంత్రి అంజనీ కుమార్ యాదవ్ తనుయుడే ఈయన. 
 
2013లో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అనిల్ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
 
2018 ఎన్నికల్లో ముషీరాబాద్ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అనిల్... బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే, ఊహించని విధంగా ఆయనకు రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని హైకమాండ్ కల్పించింది.
 
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, తనకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని చెప్పుకోవడానికి తానే ఉదాహరణ అని అన్నారు. యువకుడినైన తనకు పెద్దల సభకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.