బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్?

anil kumar yadav
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నరసరావుపేట ఎంపీ స్థానానికి ఆయన అధికార వైకాపా పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన సీఎం, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం అనిల్‌తో ఈ సందర్భంగా చెప్పి నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీత ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా సునీల్‌ను పార్టీ అధినాయకత్వం కోరుతోంది. గతంలో ఆయన కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసింది. పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తిస్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్‌ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తిరిగి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణనే కొనసాగించాలని వైకాపా అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు 11న ప్రకటించిన తొలి జాబితాలో ఆయనను రేపల్లె బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.