సోమవారం, 11 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఆగస్టు 2025 (09:58 IST)

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 13 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. వర్షాలు కురిసే జిల్లాల వివరాలను పరిశీలిస్తే, 
 
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా  జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఇదిలావుంటే, నగరంలో శనివారం రాత్రి మరోమారు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మీర్‌పేట, మిథిలా నగర్‌లలో నడుము లోతు వరకు వరద నీరు నిలిచింది. బాలాజీ నగర్, సత్యసాయి నగర్‌లలో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు సాఫీగా వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నీరు నిలిచిపోయింది.