మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 3 ఆగస్టు 2019 (16:08 IST)

రూమ్‌కి రా... అంటే నేను రానన్న విద్యార్థినితో నీకు ఫీలింగ్స్ లేవా అంటూ కీచక టీచర్ మెసేజ్

తను గురువునని మరచి అమ్మాయిల వాట్సప్‌లకు అసభ్యకరమైన సందేశాలు పెడుతూ టార్చర్ పెట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సదరు కళాశాల యాజమాన్యం ఆ కీచక ఫ్రొఫెసర్ పైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌కు చెందిన సురేందర్ అనే ఆయన తిమ్మాపూర్ లోని ఓ పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలో ఈసిఈ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థులకు చదువు చెప్పాల్సిన సదరు అధ్యాపకుడు... వాట్సాప్‌లో వెకిలి చేష్టలు మొదలెట్టాడు. సదరు ఉపాధ్యాయుడి నిర్వాకంతో కొంతమంది విద్యార్థినిలు ఇప్పటికే చదువును మానేశారని అంటున్నారు.
 
సురేందర్‌కు ఇప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట. అయినప్పటికీ సురేందర్ తనలోని వేరో రూపాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. మొదట విద్యార్థినిలు... సబ్జెక్టులో ఏమైనా అనుమానాలుంటే తనకు కాల్ చేయమని నంబర్ ఇస్తాడట. కర్మకాలి అమ్మాయి ఒకవేళ ఏదైన డౌటు ఉండి కాల్ చేస్తే చాలు... ఇక తన ప్రతాపాన్ని చూపిస్తాడట. 
 
మొదట డౌట్లు తీర్చినట్టు యాక్ట్ చేస్తాడట. అనంతరం... తనలోని మరో రూపాన్ని చూపించడం మొదలు పెడుతాడట. ఇంజనీరింగ్ పాఠాలు పక్కనబెట్టి... ప్రేమ పాఠాలు మొదలెడుతాడట. అదేంటి సార్ అలా అంటారు అని విద్యార్థినిలు అడిగితే... నీవు లేక నేను లేనంటూ... మాయ మాటలు చెబుతాడు. 
 
అమ్మాయిలు మొండికేస్తే... ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు కూడా దిగుతాడట. ఈ సార్ దెబ్బకి ఇప్పటికే చాలామంది అమ్మాయిలు చదువును మానేస్తే... కొంతమంది మాత్రం నిజమేనని నమ్మి మోసపోయిన దాఖలాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ విద్యార్థినికి ఇలాగే వాట్సప్‌లో... నీ కళ్ళు బాగుంటాయని... ఇంకా అవి బాగుంటాయి ఇవి బాగుంటాయంటూ నువ్వంటే నాకిష్టమంటూ మెసేజిలు పంపించాడు. పైగా రూమ్‌కు రమ్మంటూ అసభ్యకరమైన మెసేజులు పెట్టాడు. దీనికి సదరు విద్యార్థిని రూమ్‌కెందుకు సార్ అంటూ ప్రశ్నిస్తే... అర్థం చేసుకోవాలని... పైగా... నీకు ఫీలింగ్స్ లేవా అంటూ మరో మెసేజ్ పంపించాడు. 
 
కీచక ప్రొఫెసర్ నిర్వాకానికి బెదిరిన ఆ విద్యార్థిని... ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళడంతో... కీచక ప్రోఫెసర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా సదరు వెకిలి ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు... వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.