శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (09:12 IST)

తెలంగాణ రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా అనిల్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే అతి కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు డీజీపీ అనిల్‌ కుమార్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ మంగళవారం రాత్రి ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేసింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. 
 
14 నెలల క్రితం ఐజీ హోదాలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) విభాగాధిపతిగా నియమితులైన ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందారు. అయితే, ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం మూడేళ్లు పొడిగించి ఓఎస్డీగా నియమించింది. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకే నిఘా విభాగం చీఫ్ నవీన్‌చంద్ పదవీ విరమణ చేయడంతో ప్రభాకర్‌రావుకు ఇంటెలిజెన్స్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏడాదిపాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గాను, ఎస్ఐబీ చీఫ్‌గానూ కొనసాగారు. 
 
ఈ క్రమంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్‌కుమార్‌ను నియమించడంతో ప్రభాకర్‌రావు ఎస్ఐబీ ఓఎస్డీగా మాత్రమే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాత్రికి రాత్రే ఈ తరహా నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.