సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (13:27 IST)

కారుపై కాల్పులు : ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌కు "జడ్" కేటగిరీ భద్రత

హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భద్రతను పెంచారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తక్షణమే సీఆర్పీఎఫ్ బలగాలతో 'జడ్' కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. 'జడ్' కేటగిరీ కింద మొత్తం 22 మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా ఉంటారు. అలాగే, ఒక ఎస్కార్ట్ వాహనం కూడా ఉంటుంది. వీరిలో నలుగురు నంచి ఆరుగురు వరకు ఎన్.ఎస్.జి కమాండోలు, పోలీసు సిబ్బంది ఉంటారు. 
 
కాగా, గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో కూడిన భద్రతను కల్పించింది.