ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 30 మే 2021 (17:32 IST)

తెలంగాణలో లాక్ డౌన్ వద్దండీ.. ప్లీజ్: సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం నేత అసదుద్దీన్

లాక్‌డౌన్ పొడిగింపుతో సహా పలు అంశాలపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం వెళ్లినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్‌ను పొడిగించవద్దని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఎంపి ట్వీట్‌లో ఇలా అభ్యర్థించారు.
 
లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోంది. లాక్ డౌన్ పైన నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి.
 
లాక్ డౌన్ కంటే (12thMay) ముందే కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు ఇప్పటికే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్ డౌన్ వల్లే కేసులు తగ్గలేదు. లాక్ డౌన్ లేకపోయినప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది.
 
మహమ్మారిపై సుధీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలి. మాస్కుల వినియోగం, భౌతికదూరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే పోరాడవచ్చు. అందుకు అనుగుణమైన జీవనవిధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలి.
 
మహమ్మారికి ధీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. మహమ్మారి, పేదరికం, పోలీసుల వేధింపులతో చాలా ఇక్కట్లలో పడతారు. ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా మారుస్తున్నాయి. ఇది ఎంత మాత్రం శాస్త్రీయ, మానవతా ధృక్పథం కాదు" అని పేర్కొన్నారు.