శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (09:59 IST)

హుజురాబాద్‌లో రంగంలోకి దిగిన తెరాస ట్రబుల్ షూటర్!

ఇటీవల తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్త‌రఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజకీయ పునాదులు లేకుండా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ వ్యూహం రచించారు. ఇందులోభాగంగా, తెరాస ట్రబుల్ షూటర్, తెరాస మంత్రి టి. హరీష్ రావును రంగంలోకి దించారు. 
 
నిన్నామొన్నటి వరకు ఈటలను టర్గెట్ చేసే పనిని మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. అయితే, ఆశించిన మేరకు గంగుల తన బాధ్యతలను నిర్వహించలేకపోయారు. గంగులను టార్గెట్ చేస్తూ ఈటల తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో... కేసీఆర్ వ్యూహం మార్చారు.
 
తన వ్యూహంలో భాగంగా, ఆయన హరీష్ రావును రంగంలోకి దించారు. ఈయన స్వయానా కేసీఆర్ మేనల్లుడు. తెరాసలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారు. ప్రస్తుతం ఈయన హుజూరాబాద్‌లో అడుగు పెట్టారు.
 
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పలువురు టీఆర్ఎస్ నేతలను గెలిపించిన సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్ హరీశ్‌కు ఉంది.
 
మరోవైపు, హరీశ్‌కు, ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే... హరీశ్ వర్గ నేతగా ఈటలకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో, ఈటలను దెబ్బతీసేందుకు హరీశ్ రావును రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ రాజకీయ ముఖచిత్రం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.