ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (12:44 IST)

తెలంగాణా బడ్జెట్ సమగ్ర స్వరూపం : వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో ఆ రంగానికి దాదాపు రూ.25వేల కోట్లు కేటాయించింది. ముఖ్యంగా, రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయించగా.. రైతు రుణమాఫీ కోసం రూ.5,225కోట్లు..  రైతు బీమా కోసం రూ.1200 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం  రూ.2.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉదయం 11:30 గంటలకు ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌ రెడ్డిలు బడ్జెట్‌ను సమర్పించారు. 
 
సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా, ప్రస్తుతం అమల్లో అన్ని సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగేలా ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అలాగే రైతుబంధు, పెన్షన్లు, రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించారు.  దీంతోపాటు ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీకి సంబంధించి నిధుల ప్రతిపాదన బడ్జెట్‌ సందర్భంగా ప్రస్తావించారు. 
 
ఈ సందర్భంగా విత్తమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ‘ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతి పథంలో అధిగమించింది. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపధాన పయనిస్తున్నాం. గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు’’ అని ప్రసంగంలో వెల్లడించారు.
 
 
రూ.2,30,825 కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా పేర్కొన్నారు. 
 
బడ్జెట్‌ ముఖ్యాంశాలు...
* మొత్తం బడ్జెట్ రూ.2,30,825 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు
* ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు.
* మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు.
* పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు.
* రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు.
* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు.
* సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ -రూ. వెయ్యి కోట్లు.
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
* రైతుబంధు- రూ.14,800 కోట్లు.
* రుణమాఫీ- రూ.5,225 కోట్లు.
* వ్యవసాయశాఖ - రూ.25వేల కోట్లు
* పశుసంవర్థకశాఖ- రూ.1,730 కోట్లు.
* నీటిపారుదలశాఖ- రూ.16,931 కోట్లు.
* సమగ్ర భూ సర్వే- రూ.400 కోట్లు.