ఢిల్లీ లిక్కర్ స్కామ్ : అరబిందో ఫార్మాకు చెందిన డైరెక్టర్ అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో అరబిందో ఫార్మా డైరెక్టరు శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. అలాగే, మరో వ్యక్తి వినయ్ బాబుని కూడా అరెస్టు చేసింది. వీరివద్ద వరుసగా మూడు రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించింది. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే, శరత్‌శ్చంద్రా రెడ్డి అరబిందో ఫార్మాలో 12వ డైరెక్టరుగా ఉండటం గమనార్హం.
ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. వీరిద్దరి వద్ద గత మూడు రోజులుగా విచారణ జరుపుతోంద. విచారణ ముగిసిన వెంటనే అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ఈ అరెస్టులపై ఈడీ స్పందిస్తూ, వీరిద్దరికీ కోట్లాది రూపాయల వెలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్టు శరత్‌శ్చంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. ఈడీ తాజా అరెస్టులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. మున్ముందు ఇంకెన్ని, ఇంకెంత మంది అరెస్టు అవుతారో అనే చర్చ మొదలైంది.