శ్రీలంక జట్టుకు షాక్.. అత్యాచారం కేసులో క్రికెటర్ గుణతిల అరెస్టు
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాలుపంచుకుంటున్న శ్రీలంక జట్టుకు తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు క్రికెటర్ ఓపెనింగ్ బ్యాటర్ ధనుష్క గుణతిలను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. గాయం కారణంగా మధ్యలోనే జట్టు సేవలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుతో కలిసి ఆయన స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు.
తనపై గుణతిల అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గుణతిలను ఆదివారం ఉదయం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రీలంక జట్టు గుణతిల లేకుండా స్వదేశానికి బయలుదేరింది.
ఈ టోర్నీలో శ్రీలంక జట్టు నమీబియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సభ్యుడిగా గుణతిల ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో గాయపడిన గుణతలి... ప్రత్యామ్నాయ ఆటగాడు జట్టులో చేరేంత వరకు జట్టుతోనే కలిసివుండాలని లంక క్రికెట్ బోర్డు కోరడంతో ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు.
ఈ క్రమంలో స్థానిక యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో సిడ్నీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన గుణతిల గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. స్వదేశంలో ఓ నార్వే యువతిని గుణతిలతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ కేసు నుంచి గుణతిల బయటపడ్డాడు. కానీ ఇపుడు ఆస్ట్రేలియాలో చిక్కుకున్నాడు.