ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు... పోటెత్తిన జనం
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ ఏటీఎం కేంద్రంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. దీంతో స్థానికులు ఈ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. ఏటీఎం సెంటరు వద్ద భారీ క్యూ చేరిపోయింది. ఈ ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది. ఈ విషయం తెలిసిన వెంటనే అగమేఘాలపై అక్కడకు చేరుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటరును మూసివేశారు.
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎం కేంద్రంలో రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల నగదు వస్తుందన్న వార్త ఆ ప్రాంతమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో ఏ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటకు వస్తుందన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది.
ఆ వెంటనే స్పందించిన అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఆ ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. దీంతో ఏటీఎంను మూసివేసి తనిఖీ చేస్తున్నారు.