గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (13:08 IST)

బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు

basara iiit students
తెలంగాణాలోని ట్రిపుల్ ఐటీ బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ను విద్యార్థి సంఘానే నేతలు అడ్డుకున్నారు. 
 
నిజానికి ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆయన అధికారిక ప్రకటన చేస్తూ చర్చలు సఫలం అంటూ పేర్కొన్నారు. కానీ, విద్యార్థి సంఘాల నేతలు మాత్రం చర్చలు విఫలం అంటూ ట్వీట్ చేశారు. దీంతో విద్యార్థుల ఆందోళన ముగియలేదు కదా మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. 
 
పైగా, తాము చేస్తున్న 12 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్‌పై కూడా మంత్రులు స్పష్టత ఇవ్వలేదని విద్యార్థులు ప్రకటించారు. హామీ పత్రం విడుదల చేసిన మరుక్షణమే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు ప్రకటించారు. మరోవైపు, తెలంగాణ మంత్రులకు వరుసగా సెగలు తగులుతున్నాయి. 
 
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. ఈయన కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీపై స్పందించాలని ఆయన్ను విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.