ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ తరలింపు!
ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు కొత్తపేటతో ఉన్న మూడున్నర దశాబ్దాల అనుబంధం వీడనుంది. చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాలకు ల్యాండ్‌మార్క్‌గా ఉన్న గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కొహెడకు తరలిపోనుంది.
ఈ నెల 19న జరిగిన కేబినెట్ సమావేశంలో గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో కొత్తపేట నుంచి నగరశివార్లలోకి మార్కెట్ తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
నాడు నగర శివారు ప్రాంతంగా ఉన్న కొత్తపేట కాలక్రమేణా నగరంలో కలిసి రద్దీ ప్రాంతంగా మారింది. మామిడి, బత్తాయి సీజన్‌లలో మార్కెట్‌కు ప్రతిరోజూ ఐదారు వందల లారీలు వస్తుంటాయి. దీంతో మార్కెట్‌కు ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు రోడ్లపై బారులు తీరుతుంటాయి.
ఈ ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు జిల్లాల నుంచి సరుకును తీసుకువచ్చే రైతులకు కూడా అందుబాటులో ఉండేలా ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో కొహెడలో మార్కెట్ ఏర్పాటుకు వంద ఎకరాల స్థలాన్ని కెటాయిస్తూ గతంలో వైఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఏర్పాటైన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అదనంగా మరో 78 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి మొత్తం 178 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2020 వేసవిలో మామిడి సీజన్‌ను కొహెడలోనే నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేసింది.
అయితే గాలివాన బీభత్సానికి షెడ్లు నేలమట్టం కావడంతో తిరిగి గడ్డిఅన్నారం మార్కెట్‌లో క్రయ,విక్రయాలు చేపట్టారు. అయితే మంత్రి మండలి తాజా ఆమోదంతో త్వరలోనే మార్కెట్ తరలింపు పనులు మొదలుపెట్టే అవకాశాలున్నాయి.