గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (14:46 IST)

హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయాలు.. ఈటెల వర్సెస్ గులాబీ దండు

ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం వెడెక్కుతూ ఉంది. మాజీ మంత్రి ఈటెలను ఉపయోగించుకుని టీఆర్‌ఎస్‌ను మరొకసారి దెబ్బతీసేందుకు బిజెపి తహతహలాడుతూ ఉంది. ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన హూజూరాబాద్ నియోజకవర్గానికి  సెప్టెంబర్‌‌లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలస్యమయితే డెల్టాప్లస్ కరోనా వైరస్  ఏ రూపం తీసుకుంటుందోనన్న భయం కేంద్రంలో కూడా ఉంది. అందుకే డెల్టా ప్లస్ వేరియంట్ ‘వేరియంట్ అఫ్ కన్సర్న్’గా  కేంద్రం ప్రకటిచింది.
 
మూడో వేవ్ ముప్పు వార్తల నేపథ్యంలో  సెప్టెంబర్ నాటికి 80 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక అధికారి ఒకరు తెలిపారు. జాప్యం చేయకుండా ఎన్నికలు నిర్వహించాలంటే లాక్డౌన్ ఎత్తేయడమే కాదు, వ్యాక్సినేషన్ కూడా పెద్ద ఎత్తున జరగాలి. ఎందుకంటే, ఉప ఎన్నికల కోవిడ్ మూడో వేవ్‌కు దారి తీయరాదు. అందువల్ల ఎన్నికల సిబ్బందికి ముందే వ్యాక్సినేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
 
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టిఆర్ ఎస్ పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. తెలంగాణాలో బాగా పేరున్న నాయకుడయిన ఈటెల బిజెపిలో చేరడంతో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంది. హుజూరాబాద్‌లో దుబ్బాక‌ను చూపించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. 
 
ఈటెలకు నియోజకవర్గంలో పేరుంది. ఆయనకు ధనబలం జనబలం  రెండూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎన్నికల్లో గెల్చి సంచలం సృష్టించినా అది జిహెచ్‌ఎంసి ఎన్నికలు దాటి ముందుకు పోలేక పోయింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ అనుకున్నంత ఊపుతో పనిచేయలేకపోయింది. దీని వల్ల సాగర్‌లో పోటీ టిఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే జరిగింది. ఇది బిజెపి ఉరుకుల పరుగులకుకి స్పీడ్ బ్రేకర్లాగా పనిచేసింది. ఇలాంటపుడు కేసీఆర్ ప్రభుత్వం ఈటెల వివాదం చెలరేగడం, ఆయన పార్టీకి అసెంబ్లీకి రాజీనామా చేయమడం, ఆపై బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. దీనితో మరొక ఉప ఎన్నికలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం బీజేపీ ముందు ప్రత్యక్షమయింది.
 
ఉప ఎన్నిక అంటే రాజకీయ పార్టీలకు ఒక సదవకాశం. అందుకే హుజూరాబాద్  ఉప ఎన్నికల్లో తమ సత్తా చూపించుకునేందుకు ఇప్పటి నుంచే పార్టీలు  కత్తులు కటార్లు పదును పెట్టుకుంటున్నాయి. ఇక ఈటల రాజేందర్ నియోజవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆయన భార్య కూడా తిరుగుతూ ఉంది. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ బీజేపీ శ్రేణులకు ఆయన ఉత్సాహం ఎక్కిస్తున్నారు.
 
బీజేపీలో చేరి, హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఈటెలను బాగా ప్రతిష్టాత్మకం చేశారు. బీజేపీలో శ్రేణుల్లో ఎంత ఉత్సాహం మొదలయిందంటే పార్టీ అపుడే ఎన్నికల టీమ్‌ని ప్రకటిచింది. నియోజకవర్గం ఇన్చార్జ్‌గా మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నియమించారు. కో ఇన్చార్జ్‌లుగా మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను పార్టీ నియమించింది.
 
హుజురాబాద్ టౌన్‌కు దుబ్బాక స్టార్ ఎమ్మెల్యే రఘునందనరావును నియమించారు.  హుజూరాబాద్ రూరల్‌కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీకి ఎంపీ అరవింద్, జమ్మికుంట రూరల్‌కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావులను నియమించారు.
 
వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంట మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్; కోఆర్డినేటర్‌గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులను పార్టీ నియమించింది ఎన్నికల వేడిపెంచుతున్నది.
 
ఇక టిఆర్ఎస్ రాష్ట్రంలో యాంటి ఆంధ్ర సెంటిమెంట్ రగిలించబోతున్నది. కృష్ణా జలాలను ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రాంతం రాయలసీమకు తరలించుకుపోతున్నారంటూ ఆంధ్ర మీద జలయుద్ధం ప్రకటిచింది. 
 
కృష్ణా జలాలు తెలంగాణకు దక్కాలంటే అపర భగీరధుడైన ముఖ్యమంత్రి కెసిఆర్ బలంగా ఉండాలని, దీని కోసం ఆయన నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలనే కోణంలో పింక్ పార్టీ ముందుకు పోతుంది. 
 
ఇప్పటికే మంత్రులు ఆంధ్ర మీద నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గం బయట ఈ ఉద్రికత్త పెరుగుతూ ఉంటే,నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ తో పాటు అనేక మంది సీనియర్ టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.