మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (16:21 IST)

తెలంగాణాను క్లస్టర్లుగా విభజించిన బీజేపీ

bjp flags
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని కమలనాథులు కలలుగంటున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఇందులోభాగంగా, తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా ఆ పార్టీ విభజన చేసింది. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కేంద్ర మంత్రిని ఇన్‌చార్జ్‌గా నియమించింది. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించనున్నారు. 
 
ఎన్నికల్లో వీరు పోటీ చేయకపోయినప్పటికీ పార్టీ టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రచారం, బూత్ కమిటీలను బలపేతం చేయడం తదితర అంశాలను వీరు స్వయంగా పర్యవేక్షిస్తారు. తమ క్లస్టర్ పరిధిలోని పార్టీ జయాపజయాలపై నిరంతరం సమీక్ష చేస్తూ స్థానిక నేతలను ప్రోత్సహిస్తుంటారు. 
 
తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, జహీరాబాద్ పేరిట నాలుగు క్లస్టర్లుగా విభజన చేసింది. ఇందులో హైదరాబాద్ క్లస్టర్‌కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇన్‌చార్జ్‌గా నియమించారు. అలాగే, జహీరాబాద్‌ క్లస్టర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదిలాబాద్‌ క్లస్టర్‌కు కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాల, వరంగల్ క్లస్టర్‌కు రావు ఇంద్రజిత్‌ సింగ్‌ను నియమించింది.