బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (11:39 IST)

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్... వందకు తగ్గిన కోడి ధర

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణలో గత నెల రోజుల వ్యవధిలో కోడి మాంసం ధర ఏకంగా రూ.100 వరకు తగ్గింది. వాణిజ్య డిమాండ్‌ తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రూ.270 వరకు పలికిన బాయిలర్ చికెన్ ధర ఇప్పుడు 170కి తగ్గింది. 
 
కరోనా విలయతాండవంతో ఫంక్షన్లు, సభలు, సమావేశాలు తగ్గిపోయాయి. దీంతో 30 శాతం వరకూ డిమాండ్‌ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా తెలంగాణలో రోజుకు సగటున 9 లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 5 లక్షల కిలోలకు మించి అమ్ముడు పోవడం లేదు. 
 
హోటల్స్‌లో సాధారణంగా రాత్రిపూట అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ వల్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయని కోళ్ల ఫారాల సమాఖ్య తెలిపింది. 
 
మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌తో.. తెలంగాణ నుంచి ఆ రాష్ట్రాలకు కోళ్ల సరఫరా నిలిచిపోయింది. మరోవైపు మహారాష్ట్రలోని ఫౌల్టీ రైతులు కోళ్లను తెలంగాణలోని సరిహద్దు జిల్లాలకు తీసుకొచ్చి అతి తక్కువ ధరకు అమ్ముతుండటం కూడా స్థానిక వ్యాపారులకు నష్టం కలిగిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో కోడి మాంసానికి పెద్దగా డిమాండ్‌ లేనప్పటికీ మార్చి నాటికి అమ్మకాలు పెరిగాయి. దీంతో ఫౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం భారీగా చేపట్టారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పుడు విక్రయాలు తగ్గడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. 
 
కిలో బరువు కోడిని పెంచాలంటే సగటున రూ.90 వరకూ రైతు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కిలో బరువున్న కోడిని రూ.66కే మాంసం వ్యాపారులకు విక్రయించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ వైపు చికెన్ ధరలు పడిపోతుంటే.. మరోవైపు మటన్, నాటుకోడి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. 
 
రాష్ట్రంలో నాటుకోళ్ల కొరత కారణంగా కిలో ధర రూ.400 వరకూ పలుకుతోంది. కడక్‌నాథ్‌ (నలుపు రంగు) కోడి మాంసాన్ని ఆన్‌లైన్‌లో కిలో రూ.400 నుంచి 500 వరకూ అమ్ముతున్నారు. గొర్రె, మేక మాంసం ధర కిలో రూ.700 నుంచి 800 వరకూ పలుకుతోంది.