డిసెంబరులో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సెషన్స్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలను ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడమే అజెండాగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కేంద్రం ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు.
అందుకే కేంద్రం చర్యలను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడుతామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం ఎలా అడ్డు తగులుతుందో ప్రజలందరికీ తెలియజేస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై ఈ సమావేశాల్లో విపులంగా చర్చిస్తామని తెలిపారు.