1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (16:39 IST)

దళితులంటే దరిద్రులు కాదు.. ఉద్యోగులకు కూడా దళిత బంధు: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పథకం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని వెల్లడించారు. రైతుబంధు తరహాలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న దళిత సోదరులకు కూడా దళితబంధు వర్తింస్తుందని ప్రకటించారు. 
 
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. హుజురాబాద్‌లో ప్రారంభించిన రైతు బంధు కార్య‌క్ర‌మం బ్ర‌హ్మాండంగా కొనసాగుతోందన్నారు. 
 
సామాజిక వివ‌క్ష నుంచి ద‌ళిత స‌మాజం శాశ్వ‌తంగా విముక్తి పొందటానికి మరో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలంగాణ సాధ‌న‌లో తొలిసింహ గ‌ర్జ‌న నుంచి నేటి వ‌ర‌కు కూడా సెంటిమెంట్‌గా విజ‌యం చేకూరే వేదిక‌గా కరీంనగర్ జిల్లా మారిందన్నారు.
 
ద‌ళితబంధు ఇది ఒక ప్ర‌భుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక మ‌హా ఉద్య‌మమన్నారు. ఈ ఉద్య‌మం ఖచ్చితంగా విజ‌యం సాధించి తీరుతుందన్నారు. గ‌తంలో తాను తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవని, ప్రజల దీవ‌నెలతో రాష్ట్రం న‌లుమూలుల ఉద్య‌మం ఉవ్వెత్తున చెల‌రేగి త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 
 
రెండు నెలల్లోనే అందరికీ దళిత బంధు అందుతుందన్నారు. దళిత బంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. తెలంగాణలో 17 లక్షలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. రైతు బంధు తరహాలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామని వెల్లడించారు. దళలవారీగా దళితబంధును అమలు చేస్తామన్నారు. దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
 
తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరగాలన్నారు. ఏడాది క్రితమే దళితబంధు పథకం ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెడతామన్న విపక్షాలవి అపోహలు, అనుమానాలు అని మండిపడ్డారు. ఇరత పార్టీలకు రాజకీయం అనేది ఒకే గేమ్ అని విమర్శించారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయని అన్నారు. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తామని స్పష్టం చేశారు.
 
హుజురాబాద్ నియోజవకర్గంలో మొత్తం 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయన్నారు. రెండు, మూడు నెలల్లో దళితులందరికీ దళితబంధు ఇస్తామన్నారు. 25 ఏళ్ల క్రితం నుంచే దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. 
 
అవకాశాలు, ఆస్తులు లేక దళితులు అణగారిపోయి ఉన్నారని పేర్కొన్నారు. దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఇది మహా ఉద్యమం అని ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందన్నారు. ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధు నిధులు ఇస్తామన్నారు. నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు అమలు చేస్తామని వివరించారు. 
 
భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాదిగా మారుతుందన్నారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దళితులంటే దరిద్రులం కాదు.. ధనవంతులం అని మారి చూపించాలన్నారు. 
 
భార‌త‌దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయని చెప్పారు. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని సీఎం తెలిపారు. అయినా ఇప్పటికీ సామాజిక వివ‌క్ష ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.