తెలంగాణలో కరోనా కేసులు రెండింతలు.. హైకోర్టును తాకిన కోవిడ్ మహమ్మారి
తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో కేసులు రెట్టింపవుతున్నాయి. తాజాగా రోజుకు 1000కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 1,097 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 43,070 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో వెయ్యి తొంబై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 13 వేల 2 వందల ముప్పై ఏడుకు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,723కి చేరింది.
మరోవైపు తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అలాగే పదుల సంఖ్యలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది.
భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది జూన్‌లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన, తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశముంది.