ప్రగతి భవన్‌లో కరోనా కలకలం : ఐదుగురికి పాజిటివ్

pragathi bhavan
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 3 జులై 2020 (08:43 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈ భవన్‌లో పని చేసే సిబ్బందిలో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయం తెలియగానే అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు.

ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా గజ్వేల్‌లోని ఆయన సొంత నివాస గృహంలో ఉంటుండడంతో ఆయనకు ముప్పు తప్పింది. ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపగా, దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భయపెట్టేలా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో 1,213 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 998 కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి పెరిగింది.

ఇక, తాజాగా 987 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 9,069కి చేరింది. ప్రస్తుతం 9,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో మరో 8 మంది మృతి చెందగా, కరోనా మరణాల సంఖ్య 275గా నమోదైంది.దీనిపై మరింత చదవండి :