ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (09:54 IST)

రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయడమే కాదు జైలుశిక్ష కూడా?

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు పంపారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఉల్లంఘనుల తాట తియ్యనున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేయడమే కాదు జైలుశిక్ష కూడా విధించనున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.
 
యాక్సిడెంట్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇతర ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయినా, రద్దైనా లెక్క చేయకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు వారికి రూ.10వేల జరిమానా, 3 నెలల జైలుశిక్ష విధించనుంది. వీరి కోసం త్వరలోనే సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
 
"ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా సస్పెండైన వారు లేదా రద్దయిన వారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలు చేసిన వారు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పదే పదే పోలీసులకు దొరికిన వారు, ఇష్టానుసారంగా, నిబంధనలు తుంగలో తొక్కి వాహనాలు నడిపిన వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు వందల సంఖ్యలో లేఖలు రాశాము"అని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.