ఆదివారం, 15 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:16 IST)

ఎంసెట్‌‍లో వెయిటేజీ మార్కులు శాశ్వతంగా రద్దు.. తెలంగాణ సర్కారు నిర్ణయం?

tseamcet
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుకు 25 శాతం వెయిటేజీని ఇస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ వెయిటేజీ మార్కులను శాశ్వతంగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావంతో గత మూడేళ్ల నుంచి ఎంసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే విధానాన్ని పాటించాలని నిర్ణయించారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 
 
జేఈఈ వంటి వాటిల్లో మార్కుల వెయిటేజీ పద్దతి లేకపోవడంతో ఎంసెట్‌లో కూడా దీన్ని తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంతో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ పరీక్షలో మొదట గణితం, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించారు. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వస్తున్నందన ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండటంతో మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. ఈ పర్సంటైల్ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుని ఎవరు పెద్దవారు అయితే వారికి మెరుగైన ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇపుడు ఈ వెయిటేజీ మార్కులను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ యేడాది మే 7 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి.