తెలంగాణాలో ఈటల కాక : రోజుకో నేతతో ఈటల భేటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రస్తుతం ఈయన తెరా శాననసభ్యుడుగా ఉన్నారు. అయినప్పటికీ తెరాస కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోజుకో నేతతో భేటీ అవుతూ రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నారు.
ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించారు.
ఈ నేపథ్యంలో మొదట తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలతో చర్చలు జరిపిన ఈటల... మంగళవారం హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. బుధవారం ఎంపీ డి.శ్రీనివాస్‌తో ఆయన సమావేశం అయ్యారు.
వీరిద్దరూ దాదాపు గంటన్నరకు పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తన భవిష్యత్తు రాజకీయాలపై ఈటల చర్చించినట్టు తెలుస్తోంది.
అక్కడే డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల రాజేందర్ కలవడం గమనార్హం. త్వరలోనే ఈటల తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, మాజీ మంత్రి ఈటలతో మాజీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమై, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పైగా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని మాజీ ఎంపీ కొండా కూడా వ్యాఖ్యానించారు.