అశ్రునయనాల మధ్య ఒకే చితిపై భార్యాభర్తలకు అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో దారుణ హత్యకు గురైన వామనరావు న్యాయవాద దంపతులకు స్థానికులు అశ్రునయనాల మధ్య ఒకే చితిపై అంత్యక్రియలు పూర్తిచేశారు. వామనరావు, ఆయన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేసిన విషయం తెల్సిందే.
ఈ జంట హత్యలు తెలంగాణా రాష్ట్రంలో పెను సంచలనంగా మారాయి. ఈ క్రమంలో పెద్దపల్లి ఆస్పత్రిలో గురువారం ఉదయం 10 గంటలకు డాక్టర్లు, పోలీసుల పర్యవేక్షణలో, వీడియో చిత్రీకరణలో పోస్టుమార్టం నిర్వహించారు.
మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాలను వారి స్వగ్రామం గుంజపడుగుకు తరలించారు. సాయంత్రం గోదావరి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. వామనరావు, నాగమణి మృతదేహాలను ఒకే చితిపై ఉంచారు. వామనరావు సోదరుడు గట్టు ఇంద్రశేఖర్ చితికి నిప్పంటించారు.
మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గట్టు దంపతుల మృతదేహాలకు నివాళులర్పించారు. అంత్యక్రియల్లో హైకోర్టు న్యాయవాదులు రాపోలు భాస్కర్‌రావుతోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నాగమణి స్వస్థలమైన రాజాం నుంచి ఆమె తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు. తన కూతురు, అల్లుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వామనరావు దంపతుల హత్యపై అతని తండ్రి కిషన్‌రావు, సోదరుడు ఇంద్రశేఖర్‌లను పోలీసులు మరోసారి విచారించారు. గుంజపడుగుకే చెందిన పూదరి చంద్రయ్య మంథని కోర్టు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడాడని, తన కుమారుడి కదలికలపై అతనే హంతకులకు సమాచారం ఇచ్చి ఉంటాడని కిషన్‌రావు అనుమానం వ్యక్తం చేశారు.