1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (14:41 IST)

చిరంజీవి సహృదయుడు.. వివాదంపై ఆయునతోనే మాట్లాడుతాను : గరికపాటి

garikapati
హైదరాబాద్ నగరంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారథ్యంలో గురువారం అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు అనేక సినీ రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు వ్యాఖ్యలు చిన్నపాటి వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా, ఈ కార్యక్రమానికి రాగానే ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు అనేక మంది ఎగబడ్డారు. ఇది గరికపాటికి అసహనం తెప్పించింది. 
 
చిరంజీవి సెల్ఫీలు దిగడంమానేసి ఆయన స్థానంలో కూర్చొంటేనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని లేకుంటే ప్రసంగాన్ని ఆపేసి మధ్యలో వెళ్లిపోతానంటూ కాస్త చిరాకు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి నేరుగా వేదికపైకి వచ్చి గరికపాటికి అభివాదం చేసి కార్యక్రమం కొనసాగేలా చూశారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చిరంజీవి అభిమానులు గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ కుమార్ శుక్రవారం ఫోనులో గరకిపాటితో మాట్లాడారు. చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని, అభిమానుల్లో ఆగ్రహం కలిగినా వారిని శాంతింపజేశామని ప్రవచనకర్తకు చెప్పారు. పైగా, ఎక్కడైనా మెగా ఫ్యాన్స్ ఇబ్బంది కలిగించారా? అని గరికపాటిని భవానీ కుమార్ ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని గరికపాటి సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, ఎవరూ తనను ఇబ్బంది పెట్టలేదన్నారు. చిరంజీవి ఎంతో సహృదయుడని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడుతానని గరికపాటి వివరణ ఇచ్చారు. పైగా, ఈ విషయం అందరికీ చెప్పండి. ఇవాళే తప్పకుండా మాట్లాడుతాని భవానీ కుమార్‌కు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన సంబాషణలకు సంబంధించిన వీడియోను భవానీ కుమార్ విడుదల చేశారు.