శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:03 IST)

ఘట్‌కేసర్‌ కిడ్నాప్ డ్రామా.. బి ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య.. నిద్ర మాత్రలు మింగి..?

ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ డ్రామా సంచలనం రేపింది. ఘట్‌కేసర్‌లో ఓ బీ ఫార్మ‌సీ విద్యార్థిని త‌న‌ను కిడ్నాప్ చేశార‌ని, త‌న‌పై అత్యాచారం జ‌రిగిందని డ్రామా చేసింది. అయితే తాజాగా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మంగళవారం రాత్రి నిద్ర‌మాత్ర‌లు మింగింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి పోలీసులు, మీడియాను ఆమె త‌ప్పుదోవ ప‌ట్టించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చివ‌ర‌కు త‌న‌కు ఇంట్లో ఉండ‌డం ఇష్టంలేకే అలా చేశాన‌ని ఆ యువ‌తి అంగీక‌రించింది. 
 
ఇటీవ‌లే ఆమెను ఆసుప‌త్రి నుంచి ఆమె డిశ్చార్జి  అయి, త‌న ఇంట్లో కాకుండా అమ్మ‌మ్మ ఇంట్లో ఉంటోంది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి, చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉండ‌డం, ఆమెపై అంద‌రి నుంచీ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కార‌ణంగానే ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. యువతి బుధవారం ఉదయం 10 గంలకు చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
అంతకుముందుకిడ్నాప్ డ్రామాతో సదరు యువతి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. మేడ్చల్‌ కండ్లకోయలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్‌ఎల్‌ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్‌ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్‌ చేస్తే ఆ బస్టాప్‌ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్‌ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. దీంతో ఈ విషయాన్ని డయల్‌ 100కు కాల్‌ చెప్పారు. 
 
అప్రమత్తమైన కీసర, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్‌వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్‌ లోకేషన్‌తో ఆచూకీ లభించింది. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు.
 
విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. చివరికి ఇదంతా డ్రామా అని తేలింది. తాజాగా తాను చేసిన డ్రామాతో విమర్శలు రావడంతో తట్టుకోలేని యువతి ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మొత్తానికి ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ డ్రామా విషాదాంతంగా మారిపోయింది.