సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (09:39 IST)

బల్దియా పోరుకు సర్వం సిద్ధం : మద్యం దుకాణాలు బంద్ - నేటితో ప్రచారం సమాప్తం!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల(బల్దియా) ప్రక్రియలో భాగంగా, డిసెంబరు ఒకటో తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేసమయంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. రాజకీయ నాయకులు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
మరోవైపు, నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనుండడంతో నిన్నటి నుంచే నగరంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. అయితే, బల్క్‌గా మద్యం కొనుగోళ్లు చేయకుండా ఆబ్కారీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరైనా పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసినా, విక్రయించినా ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
ఇకపోతే, గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి ఆదివారం సాయంత్రంతో తెర పడనుంది. ఈనెల 22న బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు వెల్లడైన వెంటనే ప్రచారం మొదలైంది. గ్రేటర్ ప్రచారంలో ఈసారి పార్టీల తరపున ముఖ్యనేతలంతా విస్తృత ప్రచారం చేశారు. అధికార పార్టీ తరపున రాష్ట్ర మంత్రులు డివిజన్లలో మకాం వేశారు. శనివారం సీఎం కేసీఆర్​ ఎల్‌బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు.
 
ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన కార్యకర్తలతో హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. స్థానిక నేతల కంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన నేతలే ఎక్కువగా ప్రచారం చేశారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు వచ్చి ప్రచారం చేశారు. 
 
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, కిషన్‌రెడ్డితో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యతో సహా రాష్ట్ర నేతలు ప్రచారం చేశారు. ఇక ఈ రోజు అమిత్‌ షా ప్రచారం నిర్వహించనున్నారు.
 
కాగా, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పరిసమాప్తం కానుంది. ఈ మేరకు సాయంత్రం వరకు ప్రచారపర్వాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారథి పేర్కొన్నారు.
 
జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే 48 గంటల్లో ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
 
నేడు అమిత్ షా రాక 
ఇదిలావుంటే, గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్‎కు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. ఉదయం 10.45 గంటలకు భాగ్యలక్ష్మీ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
అనంతరం వారాసిగుడా చౌరస్తా నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అమిత్ షా చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల సరళి, ప్రజల స్పందన, పోలింగ్ అంశాలపై చర్చించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.