తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచే యోచలో ఉంది.
ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఐతే రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచాలా? లేదంటే 60కి పెంచితే సరిపోతుందా? అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
త్వరలో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సమర్పించే రిపోర్టు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం కేసీఆర్.ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 26వేల మందికి పైగా ఉద్యోగులు వచ్చే మూడేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నారు.
వారంతా సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తే వారికి గ్రాట్యుటీతో పాటు ఇతర బెనిఫిట్స్ కల్పించాల్సి ఉంటుంది.
ఐతే రిటైర్మెంట్ వయసు పెంచితే ప్రస్తుతానికి ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా రాబోయే మూడేళ్లలో ఏటా రూ.3500 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.