శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:59 IST)

తహసీల్దార్, వీఆర్వో అధికారాలకు క‌త్తెర

తెలంగాణలో భూముల డ‌బుల్ రిజిస్ట్రేష‌న్లకు ఇక‌ బ్రేకులు ప‌డ‌నున్నాయా? ల్యాండ్ మ‌్యుటేష‌న్ పేరుతో డ‌బ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారుల‌కు ఇక చుక్కలు క‌నిపించ‌నున్నాయా? భూముల కొనుగోళ్లు, అమ్మకాల‌పై ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానంతో రెవెన్యూ శాఖ‌లో అవినీతికి చెక్ పెడ‌తామంటోంది తెలంగాణ సర్కార్. 
 
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళ‌న‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెవ‌న్యూ శాఖ‌లో ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించడమే ల‌క్ష్యంగా సర్కార్‌ అడుగులు వేస్తుంది. భూ లావాదేవీల‌లో అధికారులు, రియ‌ల్ వ్యాపారులు క‌లిసి చేసే అవినీతికి చెక్ పెట్టేందుకు ప‌క‌డ్బందీగా ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం.
 
ల్యాండ్ మ్యుటేష‌న్‌పై ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోంది. త‌మ పేరుపై రిజ‌స్ట్రర్ అయి ఉన్న భూముల‌ను రెవ‌న్యూ రికార్డుల‌లో న‌మోదు చేసే ప్రక్రియే మ్యుటేష‌న్. ఈ మ్యుటేష‌న్లను అడ్డుపెట్టుకున్న కొంద‌రు రెవెన్యూ అధికారులు.. అవినీతికి తెర‌లేపుతున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. 
 
మ్యుటేష‌న్ల కోసం లంచం తీసుకుంటూ.. ఎక్కడో చోట ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. దీంతో ప‌క‌డ్బందీగా కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా మొద‌ట తహసీల్దార్, వీఆర్వో అధికారాలకు క‌త్తెర పెట్టనున్నారు. మ్యుటేష‌న్ విష‌యంలో ఉండే విచ‌క్షణ అధికారాన్ని కొత్త చ‌ట్టంలో క‌ట్ చేయ‌బోతుంది స‌ర్కార్.