తెలంగాణ దేవస్థానాల్లో విజయ డెయిరీ నెయ్యి మాత్రమే
తెలంగాణలో విజయ డెయిరీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి ప్రోత్సహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
ఏటికేడు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో... పోషకాహార భద్రత ఇచ్చే ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వినియోగం, ఉత్పత్తులకు గిరాకీ సృష్టించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణలో... ప్రత్యేకించి జంట నగరాల్లో యువతకు ఉపాధి కల్పన దిశగా విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో విజయ డెయిరీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.
పార్లర్‌లో తిరిగిన మంత్రి... పాల ఉత్పత్తులను పరిశీలించారు. కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని దేవస్థానాల్లో విజయ డెయిరీ ఉత్పత్తులైన నెయ్యి మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేశారు.
సమ్మక్క సారక్క జాతరలో 20 విజయ డెయిరీ స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కృష్ణా, గోదావరి నదీ పుష్కరాల్లోనూ విజయ డెయిరీ ఉత్పత్తులు విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.