శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:38 IST)

సంతోషంగా మత్స్యకారులు: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలోని మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తో కలిసి అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున మత్స్య శాఖకు నిధుల కేటాయించడం, ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా మత్స్య సంపదను మార్కెటింగ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాబోయే రోజులలో చేపలను ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో, మున్సిపాలిటీ లలో చేపల మార్కెట్ ల నిర్మాణాలు చేపట్టేందుకు స్థల సేకరణ కోసం జిల్లాల కలెక్టర్ లను సంప్రదించాలని ఆదేశించారు.

ప్రజలకు చేపలను అందుబాటులోకి తీసుకెళ్ళే ఆలోచనతో డివిజన్ కు ఒకటి చొప్పున 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కూడా తొలుత గా మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, రానున్న రోజులలో ప్రధాన మున్సిపాలిటీ లలో కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

అంతేకాకుండా మత్స్యకారులు చేపలను విక్రయించు కోవడానికి గాను 1000 కోట్ల రూపాయల ఖర్చుతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద ద్విచక్ర వాహనాలు, లగేజి ఆటోలు, ట్రక్ లు సబ్సిడీపై అందజేసినట్లు చెప్పారు.

అధికారులు వారంలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సక్రమంగా అమలు అవుతున్నాయా? పరిశీలించాలని, మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి సాదించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ఈ సంవత్సరం 18,335 వివిధ నీటి వనరులలో 50 కోట్ల రూపాయల ఖర్చుతో 68 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో మరిన్ని నీటి వనరులు అందుబాటులోకి వస్తున్నందున చేపపిల్లల అవసరం మరింత పెరిగే అవకాశం ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తి ని మన రాష్ట్రంలోనే చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల లబ్ది అర్హులైన ప్రతి మత్స్యాకారుడికి అందేలా చూడాల్సిన బాద్యత అధికారులపై ఉందని మంత్రి చెప్పారు. త్వరలోనే మత్య్సకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.