గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (09:14 IST)

ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే.. మోదీది అహంకారపు చర్య: బీఆర్ఎస్

kcrao
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు పార్లమెంటుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటును ఖండించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని, రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు అనర్హులుగా ప్రకటించడం నరేంద్ర మోదీ అహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట’’ అని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అయిన పార్లమెంట్‌ను తన నీచ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం దారుణమని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ఇది ప్రతికూల సమయమని కేసీఆర్ అన్నారు. మోదీ పాలనలో ఎమర్జెన్సీ నీలినీడలు కమ్ముకున్నాయని.. విపక్ష నేతలపై వేధింపులు పరిపాటిగా మారాయని.. నేరస్థులు, మోసగాళ్లను కాపాడేందుకు ప్రతిపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తూ మోదీ సొంతంగా కుప్పకూలుతున్నారని మండిపడ్డారు. 
 
పార్టీల మధ్య వివాదాలకు ఇది సమయం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని, బీజేపీ దుష్ట విధానాలను ప్రతిఘటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
 
అలాగే BRS వర్కింగ్ ప్రెసిడెంట్- రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమేనని అన్నారు. "ఈ విషయంలో చూపిన తొందరపాటు అత్యంత అప్రజాస్వామికం, దీనిని నేను ఖండిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. 
 
ఇంకా ఈ వ్యవహారంపై కోర్టుల్లో అప్పీలు చేసుకునే అవకాశం ఉందని తెలిసినా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.కవిత పేర్కొన్నారు. "తన వైఫల్యాలు, అవినీతి స్నేహితుల నుండి ప్రజల దృష్టిని మరల్చడం మరియు ప్రతిపక్షాలను అణచివేయడం మోడీ జీ లక్ష్యంలో ఇది చాలా పెద్ద భాగం" అని ఆమె అన్నారు.