శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (13:17 IST)

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఉద్రిక్తత.. ప్రధాన సూత్రధారి అరెస్ట్

Agneepath protest
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తూ పాత విధానంలోనే సైనిక నియమాకాలను చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. 
 
రైల్వే ప్లాట్ ఫామ్ మొత్తాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. భారీగా అదనపు బలగాలను తరలిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 15 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తోంది.  
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. వేలాది మంది యువకులు రైలు పట్టాలపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు.
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును  పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావు పేటలో అతడిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
విధ్వంసం సృష్టించేలా ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను అతను రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ తరహాలో గుంటూరులో కూడా ఆందోళన చేపట్టాలని అతను ప్లాన్ చేశాడని గుర్తించారు. 
 
సుబ్బారావు గుంటూరులో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించి ఆర్మీ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్నాడు. ఇతర నగరాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు  చేశాడు.
 
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని సుబ్బారావు పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి అభ్యర్థులకు పిలుపునిచ్చాడు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను  ముట్టడించాలని రెచ్చగొట్టాడు. సుబ్బారావు కూడా గుంటూరు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చాడు. వాట్సప్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సందేశాలు పంపించడంతోనే అల్లర్లు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.