పెయింటర్ ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ రమ్మీ
ఆన్‌లైన్ రమ్మీ ఓ పెయింటర్ ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, మనలి, అన్నా వీధికి చెందిన నాగరాజన్ (37) పెయింటింగ్ కార్మికులతో పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తున్నాడు.
అయితే ఈయన కొన్నాళ్లుగా ఆన్ లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ వరుసగా డబ్బులు కోల్పోయాడు. అయితే కోల్పోయిన డబ్బులను ఎలాగైనా మళ్లీ సంపాదించాలనే పట్టుదలతో భార్య నగలు తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 20 లక్షల వరకు కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆన్ లైన్ రమ్మీ వద్దని బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి హితవు పలికారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం కూడా తన సెల్ ఫోన్ అమ్మి నాగరాజన్ రమ్మీ ఆడి, ఈ డబ్బు కూడా కోల్పోయాడు.
ఈ పరిస్థితుల్లో నాగరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.