సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (15:48 IST)

హైదరాబాద్ నగరంలో భయానక దృశ్యం, అందరూ చూస్తుండగానే ఓల్డ్ సిటీలో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల చెట్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ నిలిపివేయబడింది. వరదనీరు నగరంలోని లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ఓల్డ్ సిటీలో అందరూ చూస్తుండగానే వరదనీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. కార్లు, ద్విచక్ర వాహనాలైతే వరద ప్రవాహంలో కొట్టుకుని పోయాయి.
 
మరోవైపు హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతతో పలు వాహనాలు గల్లంతయ్యాయి. 
వరద ఉధృతికి గగన్‌పహాడ్‌ వద్ద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్పాచెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది.
 
ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృత దేహాలను వెలికితీశారు. బస్సులు, కార్లు, లారీలు వరద నీటిలో కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి.
 
రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని బుధవారం ఉదయం రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌ కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిని మూసివేసి ట్రాఫిక్‌ను ఔటర్‌ రింగ్‌రోడ్డుకు మళ్లించినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తెలిపారు.