గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జులై 2023 (13:56 IST)

స్నేహితుల సలహాతో అమిత వేగంతో డ్రైవింగ్.. నార్సింగి రోడ్డు ప్రమాదంలో నిజాలు

narsing road accident
ఇటీవల హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న ముగ్గురు మహిళలను అమిత వేగంతో వచ్చిన కారు ఒకటి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు ఈ ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ బదియుద్దీన్ ఖాద్రీ.. స్నేహితుడి చెప్పుడు మాటలు విని కారును వేగంగా నడిపిన విషయం వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ ఉండదని, కాబట్టి వేగంగా వెళ్తే ఆ మజానే వేరని స్నేహితుడు బనోత్ గణేశ్ చెప్పడంతో ఖాద్రీ చెలరేగిపోయాడు. 
 
ఒక్కసారిగా కారు యాక్సిలేటర్‌ను తొక్కాడు. అంతే.. కారు ఏకంగా 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంతో ఖాద్రీ నియంత్రణ కోల్పోయాడు. ఆ సమయంలో మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన తల్లీ కూతళ్లతో పాటు మరో మహిళను ఢీకొట్టింది. దీంతో ఈ ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు మహిళలు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా, స్నేహితుడు చెప్పడం వల్లే తాను అంత వేగంగా కారు నడిపినట్టు తెలిపాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న గణేశ్, మహ్మద్ ఫయాజ్, సయ్యద్ ఇబ్రహీముద్దీన్ కారును అక్కడే వదిలేసి జారుకున్నారు. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.