1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (16:46 IST)

లైంగిక అకృత్యానికి పాల్పడిన వైద్యుడు.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష

doctor
ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుడు లైంగిక అకృత్యానికి పాల్పడ్డాడు. కామాంధుడి నేరం రుజువు కావడంతో ధర్మాసనం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో ఆరేళ్ల క్రితం చోటుచేసుకుంది. 
 
సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రోగిపై పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై వైద్యుడికి నాంపల్లి కోర్టు మంగళవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 
 
హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ.. ఊపిరితిత్తుల సమస్యతో 2016 మే 13న హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని భాస్కర చెస్ట్ క్లినిక్‌కు రిఫర్ చేశారు. అనంతరం ఆమె ఆ ఆసుపత్రికి వెళ్లింది. 
 
ఈ క్రమంలో డాక్టర్ ​విజయభాస్కర్​ వైద్య పరీక్షల పేరుతో గదిలోనికి తీసుకెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్​ పార్టులను తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఇదేంటని మహిళ ప్రశ్నించగా వైద్య పరీక్షల్లో భాగమంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలు మందులు తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. 
 
అక్కడ మరోసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య తలెత్తడంతో బాధితురాలు మళ్లీ హైదారబాద్‌కు తిరిగి వచ్చింది. మళ్లీ అదే ఆసుపత్రికి వెళ్లి నిందితుడైన వైద్యుడిని సంప్రదించింది. చెకింగ్ సమయంలో డాక్టర్ మళ్లీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడంతో బాధితురాలు.. అతని దుర్భుద్దిని పసిగట్టింది. అనంతరం పోలీసులను ఆశ్రయించి డాక్టర్‌పై ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డాక్టర్ బాగోతం నిజమని తేలడంతో పోలీసులు విజయ్​కుమార్‌ను అరెస్ట్​ చేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన నాంపల్లి సెషన్స్​కోర్టు జడ్జి కె.కవిత నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.