ఐదు నెలల తర్వాత పట్టాలెక్కిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు మాత్రం నిల్!!
కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో గత ఐదు నెలలుగా దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ అయింది. వీటిలో మెట్రో రైల్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి తొలుత మెట్రో రైల్ సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి మెట్రో రైళ్లు పట్టాలెక్కాయి. అంటే 169 రోజుల తర్వాత ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో మెట్రో పరుగులు తీసింది.
మార్చిలో విధించిన లాక్‌డౌన్ నుంచి మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పలు నగరాల్లోని మెట్రో సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. అయితే అన్‌లాక్4 దశలో భాగంగా సోమవారం నుంచి ఢిల్లీ, నోయిడా, లక్నో, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ మెట్రో సర్వీసులు తొలి విడతలో భాగంగా మియాపూర్ - ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రయాణికులకు మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
దశవారీగా మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు ఎల్బీనగర్ - మియాపూర్ కారిడార్‌లో ప్రారంభమవగా, రేపు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఈ నెల 9 నుంచి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్‌లో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
కాగా, కంటోన్మెంట్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. గాంధీ దవాఖాన, భరత్‌నగర్, మూసాపేట, యూసఫ్‌గూడా మెట్రో స్టేషన్లను మూసివేశారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా స్టేషన్లు, రైళ్లలో మార్కింగ్ ఏర్పాటు చేశారు.
నగదు రహిత రూపంలో ప్రయాణం చేసేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆన్‌లైన్, స్మార్ట్‌కార్డ్, క్యూఆర్‌కోడ్ టికెట్లతో మాత్రమే ప్రయాణికులకు అనుమతిస్తున్నారు. మెట్రో స్టేషన్‌లోకి రావాలంటే మాస్క్ తప్పనిసరి చేశారు. లేనట్లయితే అధికారులు జరిమానా విధిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ చేసిన తర్వాతే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు.