1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (22:37 IST)

#Justiceforchaitra నిందితుడిని పట్టిస్తే రూ.10లక్షలు రివార్డు

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు ఆచూకీ దొరక్క పోవడంతో మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని పట్టిస్తే రూ.10లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

నిందితుడి ఆచూకీ తెలిస్తే ఈస్ట్‌ జోన్‌ డీసీపీ 94906 16366, టాస్క్‌ ఫోర్స్‌ 94906 16627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లను తెలుపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు.
 
నిందితుడి వయసు 30 సంవత్సరాలని, ఎత్తు 5.9 అడుగులు ఉంటాడని, మెడలో భుజాలపై రెడ్‌ కలర్‌ స్కార్ఫ్‌ వేసి ఉంటుందని, రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించడం.. బస్టాండ్లలో నింద్రించడం అలవాటు చేసుకున్నాడని తదితర వివరాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే నిందితుడి కోసం పోలీసులు పది బృందాలు ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 
సైదాబాదులోని సింగరేణి కాలనీ కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన మిత్రుడితో రాజు కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. దాని ఆధారంగా రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన తర్వాత శవాన్ని ఇంటిలోనే పడేసి తాళం వేసి రాజు పారిపోయాడు. ఆ తర్వాత అతను తన మిత్రుడితో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. దాంతోనే రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత రాజు ఎటు వెళ్లాడనే విషయం తనకు తెలియదని అతని మిత్రుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.