బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (08:37 IST)

భర్తను కిడ్నాప్ చేసి బలవంతంగా విడాకులు తీసుకున్న భార్య.. లవర్ సహకారం...

కట్టుకున్న భర్తను కిడ్నాప్ చేసిన భార్య.. అతనితో బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకుంది. ఇందుకోసం తన ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌వాజీద్ (31), ఆప్షియా బేగం (24) అనే దంపతులు వున్నారు. వీరికి గత 2012లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాజీద్ ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
 
ఆప్షియాకు సోషల్ మీడియా ద్వారా క్యాటరింగ్ పనులు చేసే అసిఫ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. పిల్లలు కూడా ఉన్నారు. అసిఫ్‌తో పరిచయం మరింత ముదిరి అతడిని విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న బేగం ఏప్రిల్‌లో ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. 
 
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను గుర్తించి తిరిగి వాజీద్‌ చెంతకు చేర్చారు. అయినప్పటికీ బుద్ధిమార్చుకోని బేగం మరోమారు అతడి వద్దకు వెళ్లిపోయింది. ఈసారి అత్తమామల సాయంతో తిరిగి తీసుకొచ్చారు. అయితే, తాను భర్తతో కలిసి ఉండలేనని, తనకు విడాకులు ఇప్పించాలని ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు అతడు అంగీకరించలేదు. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్‌కు ప్లాన్ వేసింది. ఈ క్రమంలో సోమవారం అసిఫ్.. ముషీరాబాద్, పార్శీగుట్టకు చెందిన ఇమ్రాన్ మహ్మద్ (31), ఎండీ జాఫర్ (33), ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్‌లతో కలిసి బైక్‌పై వాజిద్ పనిచేసే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి అతడిని బలవంతంగా తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉంచిన మతపెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించారు.
 
మరోవైపు, తమ షాపు నుంచి వాజిద్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయాన్ని చెప్పుల దుకాణ యజమాని మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాజిద్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడిని కాపాడారు. ఆయన భార్య ఆప్షియా బేగం, ఇమ్రాన్ అహ్మద్, జాఫర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి అసిఫ్‌, ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్‌ల కోసం గాలిస్తున్నారు.