శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఒకరితో సహజీవనం - మరొకరితో నిశ్చితార్థం - యువతి ఆత్మహత్య

ఓ యువతి మరో యువకుడి చేతిలో మోసపోయింది. తనతో సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి తనకు తెలియకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇల్లెందు పట్టణానికి చెందిన ఓ యువతి (34), వేంసూరు మండలం కందుకూరికి చెందిన బండి గౌతమ్ (32)లు బీఫార్మసీ కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, మూడేళ్ళ క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. 
 
ఆ తర్వాత భార్యాభర్తలుగా చెప్పుకుని కేబీహెచ్‌బీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే గత యేడాదిగా వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమలో గౌతమ్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి నిలదీసింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన గౌతమ్ ఖమ్మంకు వెళ్లగా, 17వ తేదీన గౌతమ్‌కు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పింది. ఆ వెంటనే తన ఇంటిపై అంతస్తులో నివశించేవారికి గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడు. వారు వెళ్లి చూసే సమయానికి ఆమె ఫ్యానుకు ఉరివేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.