సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హరీశ్ రావుపై పోటీకి సిద్ధం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

komatireddy
భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన విమర్శించారు. గత ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత పాలనకు చరమగీతం పాడేందుకే భారత రాష్ట్ర సమితికి చెందిన అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర  సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే, ఇలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు. 
 
ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలికేందుకు వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ప్రతి గ్రామంలో ప్రచారం చేసి రాష్ట్రంలో ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.