శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:29 IST)

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా తాగొచ్చు! ఆబ్కారీ శాఖ వైపరీత్యం

కొత్త సంవత్సర వేడుకలు వద్దంటూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ చెబుతుండగా.. ఆబ్కారీ శాఖ మాత్రం ఎవరెలా పోతే నాకేంటి.. అన్నట్లుగా ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. అసలు వేడుకలే వద్దంటుంటే.. రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం తాగేయొచ్చంటూ బార్ల తలుపులు బార్లా తెరిచేసింది!

రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి, 1 గంట వరకూ బార్లలో మద్యాన్ని అందించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్‌ శాఖ విపరీత ధోరణి చర్చనీయాంశంగా మారింది. దేశంలో నూతన సంవత్సర వేడుకలపై నిఘా పెట్టాలని, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని కూడా సూచించింది. తెలంగాణలో కరోనా మృతులకు నివాళిగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవద్దని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు గడల శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. పండగలు, వేడుకల్లో పాల్గొన్న తర్వాతే సినీ నటులకు పాజిటివ్‌ వచ్చిందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా వేడుకలకు దూరంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా సూచించారు.

రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతుల్లేవని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డిసెంబరు 31న మూడు కమిషనరేట్ల పరిధిలో అడుగడుగునా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

డ్రంకెన్‌డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆబ్కారీ శాఖ తీరు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరుచుకోవచ్చని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఓ వైపు కేంద్రం, పోలీస్‌ శాఖ హెచ్చరిస్తుండగా.. మరోవైపు సాధారణ రోజుల్లో కంటే మరికొంత ఎక్కువ సమయం దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు అంటూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులివ్వడం గమనార్హం. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి 11, జిల్లాల్లో రాత్రి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంది.

కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని అందించవచ్చని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇన్‌హౌజ్‌(ఇళ్లలో) పర్మిట్లు తీసుకునేవారికి కూడా ఒంటి గంట నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. 
 
11 గంటల నుంచే ఫ్లైఓవర్ల మూత.. 
హైదరాబాద్‌లో డిసెంబరు 31న రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేస్తారని రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌ తెలిపారు. మూడు కమిషనరేట్లలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు విస్తృతంగా ఉంటాయన్నారు. హోంగార్డు నుంచి ఏఆర్‌ పోలీసులు, సీపీ వరకు అధికారులు రోడ్డుమీదనే ఉంటారని సజ్జనార్‌ చెప్పారు.

బేగంపేట ఫ్లై ఓవర్‌ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు రాత్రి 11నుంచి మూసివేస్తారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఓఆర్‌ఆర్‌లు కూడా మూసి ఉంటాయి. విమాన టికెట్లు ఉన్న వారి వాహనాలు మాత్రమే ఓఆర్‌ఆర్‌పై అనుమతిస్తారు. 
తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహనాలు జప్తు చేస్తారు. చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తారు.

తాగి పట్టుబడిన వాహనదారులకు మొదటిసారి శిక్షగా రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే రూ.15వేలు జరిమానా, 2ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 
తాగిన మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసి, ఇతరుల మృతికి కారణమైతే వారిపై ఐపీసీ సెక్షన్‌ 304 పార్టు-2 కింద (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ ఎమాంగ్‌ టు మర్డర్‌) కేసులు నమోదు చేస్తారు. నిందితునికి పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది.
 
జాగ్రత్తలు తీసుకోవాలి: కేంద్రం 
కొత్త సంవత్సర వేడుకల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పా లిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని, కొత్త సంవత్సర వేడుకలపై పటిష్ఠ నిఘా ఉంచాలని తెలిపింది.

స్థానిక పరిస్థితుల దృష్ట్యా అవసరాన్ని బట్టి రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని సూచించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సూచనలకు అనుగుణంగా, డిసెంబరు 31తో పాటు జనవరి 1న కూడా కొన్ని పరిమితులు విధించాలని సూచించింది.