శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (16:51 IST)

కోతిని బెదరగొట్టాలనుకున్నాడు.. ఇనుప రాడ్ విద్యుత్ వైర్లకు తగిలి..?

కోతిని బెదరగొట్టేందుకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి జయనగర్‌లో నివాసం ఉంటున్న లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 
 
కరోనా లాక్‌డౌన్ అప్పటి నుంచి అతడు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. వర్క్ ఫ్రం హోమ్‌ చేస్తున్న లోకేశ్.. మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించాడు. కోతులు ఇంట్లోకి ప్రవేశించకుండా వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. ఇనుప రాడుతో వాటిని అక్కడి నుంచి తరిమేయడం మొదలుపెట్టాడు.
 
ఈ క్రమంలోనే లోకేశ్ చేతిలో ఉన్న ఇనుపరాడ్‌ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలి.. షాక్ కొట్టింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు వెంటనే లోకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.