1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హుజురాబాద్‌లో గెలిచింది బీజేపీ కాదు.. ఈటల రాజేందర్: రేణుకా చౌదరి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఈ విజయాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నాయి. మరోవైపు ఈటలకు కాంగ్రెస్ మద్దతు పలికిందంటూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా... ఆయన బయట మాట్లాడకుండా ఉంటే బాగుండేదన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ వేదికలపై మాట్లాడాలేకానీ, ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించరాదన్నారు. ఇలా చేయడం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లిపోతుందన్నారు. 
 
అదేసమయంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచింది బీజేపీ కాదని... అది ముమ్మాటికీ ఈటల రాజేందర్ వ్యక్తిగత గెలుపేనని రేణుకా చౌదరి అన్నారు. ఈటల గెలుపు కోసం స్థానిక నేతలు కూడా పని చేశారని చెప్పారు. 
 
అసలు హుజూరాబాద్‌లో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పట్టుమని పది వేల ఓట్లు కూడా సంపాదించుకోలేని బీజేపీకి ఇపుడు లక్షకు పైగా ఓట్లు వచ్చాయంటే అది కేవలం ఈటల వ్యక్తికత ఛరిష్మా అని ఆమె అభిప్రాయపడ్డారు.