బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (10:02 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

barrelakka
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం, వెన్నచర్ల గ్రామంలో జరిగింది. ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి శిరీష్ పోటీ చేస్తున్నారు. స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
వెన్నచర్ల గ్రామంలో తన అక్కకు మద్దతుగా ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బర్రెలక్కకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నవారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆమె ఉలికిపాటుకు గురైంది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
 
తాను బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయి ఓడిపోతామనే భయంతో ఈ తరహా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. కాగా బర్రెలక్కపై దాడిని ఖండిస్తూ పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమెకు భద్రతకు కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని ప్రశ్నించారు.
 
కాగా తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క హాట్ టాపిక్‌గా మారిపోయారు. ప్రచారంలో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నామినేషన్ వేసినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె పెద్ద చర్చనీయాంశంగా మారిపోయారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది.