పెద్దన్న కోసం ఎదురు చూస్తున్న రాజధాని అభ్యర్థులు!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం. రాజధానిలో తమకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించే సీనియర్ నేతల కోసం ప్రస్తుత ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఒకపుడు రాజధానికి చెందిన కొంతమంది నాయకులు తమ పార్టీలను ఒంటి చేత్తో ముందుకు నడిపించేవారు. ప్రస్తుతం అలాంటివారు బూతద్దంలో వెతికిగా కనిపించడం లేదు. పోటీలో ఉన్న కొంతమంది సీనియర్లు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను చేపట్టాల్సి ఉండగా కేవలం తమ స్థానానికే పరిమితమవుతున్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు పార్టీలో పెద్దన్నల అండ కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి.
అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ విషయానికి వస్తే ఆది నుంచి నగరం మొత్తాన్ని ప్రభావితం చేసే నేతలు పెద్దగా లేరు. కీలక నేతగా ఉన్న మంత్రి తలసానికి కంటోన్మెంట్ సమన్వయ బాధ్యతను పార్టీ అప్పగించింది. రంగారెడ్డి జిల్లాలో సబిత ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికే పరిమిత య్యారు. మల్లారెడ్డి కూడా మేడ్చల్ తోపాటు అల్లుడు పోటీ చేస్తున్న మల్కాజిగిరికి మాత్రమే వచ్చి వెళ్తున్నారు. దీంతో నగర భారాస అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ గాడ్ ఫాదర్లామారారు. కేటీఆర్‌తో రోడ్ షోలు నిర్వహించి ఆయన ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలను నిర్వహింపజేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఆ తర్వాత పి.జనార్దన్ రెడ్డి వంటివారు అగ్రనేతలు నగర కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపించేవారు. ఇప్పుడాపరిస్థితి హస్తం పార్టీలో మచ్చుకైనా కనిపించడం లేదు. నగరాన్ని పూర్తిగా ప్రభావితం చేసే నేతలు తమ పార్టీలో కనిపించడం లేదని ఇప్పటి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఫలితంగా రాజధాని పరిధిలో 29 నియోజకవర్గాల్లో పోటీలో దిగిన అభ్యర్థులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క వంటివారిపైనే గుంపెడాశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు ఆలె నరేంద్ర నగర పార్టీని ముందుకు నడిపించారు. పాతబస్తీలో పార్టీ పటిష్టానికి కృషి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గాల్లో తిరుగుతున్నా ఆయన రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సిరావడంతో మరికొంతమంది నేతల సేవలు అవసరమని అభ్యర్థులు అంటున్నారు. అగ్రనేతలు బండి సంజయ్, ఈటల వంటివారు నాయకులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరుతున్నారు.